21, ఆగస్టు 2014, గురువారం

నమ్మకం
(నమ్మకం + అమ్మకం = అపనమ్మకం)

అస్తిత్వపు పోరులో
ఆస్తికుడికి, దేవుడున్నాడని నమ్మకం
నాస్తికుడికి, దేవుడు లేడని నమ్మకం

కుటుంబ / సమాజ మనుగడకై
పెళ్లి, అనే ప్రక్రియపై ఓ జంటకు
చట్టాలపై వ్యవస్థకు ఉండేది నమ్మకం

అయితే

హెచ్చు తగ్గుల తేడాలతో
స్వార్థం, నిస్వార్ధాల ముసుగులో
లాభ నష్టాల బేరీజుల్లో

నమ్మకమే, అపనమ్మకానికి అమ్మై వెలసి,
నిజానికి ఇప్పుడు, నమ్మకం అమ్మకమై
మానవ సంబంధాలను వ్యాపారపరం చేసింది

ప్రేమిస్తే నమ్మాలా? ప్రేమిస్తే సరిపోదా?
అసలు ఎందుకు నమ్మాలి ? నమ్మించాలి?

నమ్మకం ఓ నిబంధన!,
స్వచ్చమైన ప్రేమకు నిబంధనలుండవు..
ప్రేమించే మనసుకు కావలసింది స్వేచ్చ

తల్లి బిడ్డను, ఆవు లేగను
నమ్ముతుందా ? ప్రేమిస్తుందా?
నమ్మకంగా ప్రేమిస్తుందా?

స్వార్ధానికి హేతువే నమ్మకం

నిస్వార్దానికి నిలువుటద్దం ప్రేమ
నమ్మకం, నివురుగప్పిన నిర్భంధ 
నిబంధనల సమాహారం!
ప్రేమకు పరమార్ధం మానవత్వం

30, మే 2014, శుక్రవారం

 శిశిరం!

Autumn in canberra

ఆరు ఋతువుల క్రతువులో
చెట్టు కొమ్మమ్మకు చిగురై పెరిగి ఆకై, 
చివరకు పండిన ఎండుటాకై రాలి,

ఏదీ శాస్వతం కాదన్న
జీవిత సత్యాన్నినేర్పే
   ప్రక్రుతి పాఠమే శిశిరం! 

29, మే 2014, గురువారం

కేజ్రీ వాల్
----------
సనాతన ధర్మం, వేదాలను
క్రతువు, నైవేద్యాల పరిమితిచేసి
మనుషుల నెల్ల విభజించి

నీతిని
తాత ముత్తాతల మూతులకు
పరిమితంచేసి, పురాణ ఇతిహాసాలలో
కొందరిని కోతుల, అసురులచేసి

అవినీతిని
పురోహితుల పద్యశ్లోకాల్లోనే పంచి
మాకందరికవి జీవిత పాఠాలుగజేసి
అమ్మ ఒడిలో, బడిలో, గుడిలో, నడవడిలో

మము మార్చి ఏమార్చేసి

తమ భుక్తికై, మనుగడకై
కడు యుక్తిగా కుయుక్తితో
సనాతనమైన వేదధర్మాలను
వివరణ, విస్లేషణల వివరించక
యుగ ధర్మాలవని, వక్రీకరించి

ఈ కలియుగంలో
కర్మ సిద్ధాంత ఫలంగా వెలసిన అవతారం
అన్నింటా వెలసిన  అవినీతిదెయ్యమే దేవుడని
ఎందరికి తెలుసు? ఎవరొప్పుకుంటారు ?

మనది కాకపోతే .. ఎంత దూరమైతేనేం?
అన్న జానపద సామెత చందంగా !
స్వార్ధం, నిత్యావసర వస్తువులా పెరిగిపోయి
మనిషిని మనిషి పీక్కుతినే స్థాయికి
సమాజం దిగజారిపోయిన పరిస్థితుల్లో

ఏంచేద్దాం? ఇది మా క(ఖ)ర్మ!
అని సరిపెట్టుకొనే కలియుగ ధర్మానికి
వ్యతిరేకంగా విల్లు ఎక్కుపెట్టిన బాణంలా
దూసుకువస్తున్నాడు ..అడుగో...అతడే

అవినీతికి అడ్డుగోడై నిలిచి
అరాచాకులకు సవాల్ అని
రాజకీయ పోరాటం మొదలెట్టిన
"క్రేజీ వాల్" మన కేజ్రీవాల్

అరాచక రాజకీయ రణరంగమైన
చదరంగంలో పేదవాని పక్షమై
చీడను, పీడను దులిపేందుకు
చీపురుతో ప్రక్షాళన మొదలెట్టి

విసిగి వేసారిన సామాన్యుల జీవితాల్లో
వెలుతురు, వెన్నెల కురిపించే
సూర్యు చంద్రులు ఒక్కడై వెలిసి
అందరివాడై,  ఆమ్ఆద్మీ రధసారధుడై
అందరికీ ఆప్తుడైన, మనందరి అరవిందుడు

రండి ..కలసిమెలసి ఒకటిగా..కదలిరండి... దండుగా..
కుల మత, ప్రాంతాలకతీతంగా, మన దేశానికి
దశ, దిశ నిర్దేశించే నిబద్దత కూడిన నిర్ణయంతో
ప్రతినబూని, దేశ ప్రగతికై .. జన జాగ్రుతికై !

20, మార్చి 2014, గురువారం

తెలుగు అక్షరం
------------------
తల్లి ఉగ్గుపాల మురిపానికి ఊతంగా
సత్యంధర్మం దర్శనాన నిదర్శనమై
మంచిచెడు నిజ నిర్ధారణల హేతువై
మనిషి మేధోమధనానికి మాత్రుకై
నిత్యనూతనమై ఎల్లపుడూ  జాతి
మనుగడకు భాషైమాతృమూర్తిలా 
మనిషి మనసు పొరల్లో పెనవేసుకొని 
ఆలోచనల ఆకసాన నక్షత్రమై వెలిగి 
భవితకు బాటను వేసే మాటై మిగిలి
ఆటైపాటైపాదాల పెదాల నృత్యం చేసి
జీవన గతిని మార్చే చరిత్ర పుటల్లో
మానవ హితంకోరే మత గ్రంధాలలో
అన్నిటికన్నా మిన్నగా మనందరి
ఆత్మీయతానురాగాల మదిగదిలో
నిక్షిప్తంసురక్షితంతెలుగు అక్షరం

5, మార్చి 2014, బుధవారం

డాలర్ జీవితం
-----------------
డాలర్ జీవితం
---------------
అమ్మని చూడాలనిపించి
నాన్నని కలవాలనిపించి
తమ్ముడు గురుతుకొస్తుంటే
అక్క చెల్లిళ్ళు ఎలాఉన్నారో అని
రొటీన్ ప్రవాసజీవతంపై విసిగి
అందరూ ఉండికూడా, నాకు
ఈ ఒంటరి బతుకేంటని
అనిపించిందే తడవుగా
ఫ్లైట్ సెంటర్కెల్లి కనుక్కోగా
అమ్మో! టికెట్ ధరెక్కువని?
నెల జీతం తగ్గుతుందని?
మార్ట్ గేజ్ కి మనీ ఎలాగని?
వారం సెలవు పెడితే ఎలా?
అసలే కాంట్రాక్టు జాబని
డాలర్ల జాలర్ల గాలానికి చిక్కి
చేప వలె, ఆశ అడియాసైనదన్న
గజి బిజి మనసు సేద దీర్చెన్దుకై
ట్రెడ్మిల్లుపై మరోగంట నడువగా
ఆ స్వేదంలా, నీరుగారిపోయింది

ఏమిటో .....!
జీవితం, డాలర్ మయమైపోయింది
డాలర్ అయినా రూపాయి అయినా
అందరూ కొని తినేది ఆ మెతుకే మరి
నిగూడమైన ఆ మర్మం తెలిసేంతవరకే
 డాలర్ కోసం వెతికే ఈ కరెన్సీ బతుకు
అప్పటికిగాని పూర్తవదు ఈ ప్రవాసవనవాసం
అపుడు, ఇండియా, ఇంగ్లాండ్ అయినా
ఆస్ట్రేలియా, అమెరికా అయినా  అన్నీ ఒకటే !

19, ఫిబ్రవరి 2014, బుధవారం

ముగిసిన విభజన భజన

గడ బిడ రగడల రణ గొణ ధ్వనుల నడుమ
రాష్ట్రం, విభజన సమ్మెల కాష్టమై
బడుగు వారి జీవితాలను వెలకట్టి
ఆంధ్రప్రదేస్ ఆర్ధికప్రగతి అధోగతి పట్టించి
రంగులన్నీకలిసి రాజకీయ రాట్నాన
తిరిగి తిరిగి తుదకు తెలుపైనటుల
తెలుగు సోదరుల సంఘర్షణల మధ్య
వేర్పాటువాదాన,  ఏర్పాటైనవవిగో
తెలుపునలుపు మనసులతో .. తెలంగాణా సీమాంధ్ర రాష్ట్రాలు

ఓ తెలంగాణా తిరుమలేసన్నా!
రాయలసీమ రాజన్నా! కోస్తా కోటేస్వరన్నా!

నేను ఒకప్పుడు మీకు చెప్పింది
గురుతుందా? అయితే.. ఇనుకోండి ..

సంబరాన మునిగి అసలు సంగతి మరువకండి ఎందుకంటే ?
ఆ ఆనందాన మిము ముంచి, అప్పనంగా
అధికారం మింగేయాలని ఆత్రమాత్రంగా
మంత్ర రచనలో నిమగ్నమైన నక్కలవిగో
తమ వాటా కొరకై తెలివిగా మిము మొత్తంగా
వాడుకొని నట్టేట వదిలేసే నీతిలేని తోడేల్లవి

తెలివిగా మసలుకొని అందివచ్చిన ఫలాన్ని
సమంగా అందించే సామాజిక రాష్ట్రాల
నినాదాన్ని వినిపించి,  దీపం ఉండగానే
ఇంటిని చక్కబెట్టుకోమన్న చందంగా
ఊరిని, రాష్ట్రాన్ని ఏ ఒక్కరికి (ఏ కొందరికో)
చెందేలా కాక అందరికీ ఆ త్యాగఫలం అందేలా చూడండి

మొక్కై వంగనిదే మానై వంగనటుల
రంగులోళ్ళు రంగంలోదిగి నీలాటి బడుగులను
విభజించి పాలించక మునుపే మేల్కొని
అధికారం అందుకొని నిజాయతీకి నెలవై
నిస్వార్దానికి అర్థం ఇదని పాలించి నిరూపించు
రాజకీయ విలువలను నేర్పి నీవంటి వారి
జీవితాలకు వెలుగై, నీడైనిలువు నీ ఏలుబడితో

తెలంగాణా  సీమాంధ్ర రాష్ట్రాలు ఏర్పాటు జరగాలి సమ సమాజ నిర్మాణ ధ్యేయంతో,
నిలిచిపోవాలి దేశాన మన ఇరువు తెలుగు రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలకు మార్గదర్సకంగా..


తెలంగాణా సీమాంధ్ర రాష్ట్రాల ఏర్పాటును అభినందిస్తూ.... స్వాగతిస్తూ !
తెలుగువారికి ఒక రాష్ట్రమే కాదు ఇరు రాష్ట్రాలని ఆనందిస్తూ అందరికీ మంచి జరగాలని ఆసిస్తూ .. " ఏది జరిగినా మన మంచికే " అనే సూక్తిని నమ్ముతూ
అందరికీ సుభాభివందనాలు.

4, ఫిబ్రవరి 2014, మంగళవారం

గోరువంక

గోరువంక (ఇండియన్ మైనా)
------------
పసుపు ముక్కుతోడ
పసిమి కాళ్ళతోడ
నల్లాని మెడతోడ
నాజూకైన కళ్ళతో
గోధుమ రెక్కలతో
తోకన నలతెల్లని ఈకలతో
హొయలూ, స్టైలు గలిపి
మడిసోలె నడిసేటి
గొరింకా.!.. ఓ ఇండియన్ మైనా!!

అసలిక్కడ (ప్రవాసాన )
నీ గోడవేందో?  నీకు తెలుసా?
నిన్నీడకు తెచ్చింది
పురుగు పుట్రా తిని, ఇక్కడ
పంటపొలాలకు మాంచి
దిగుబడి వచ్చేలా, వారి
సంపద పెంచేందుకేగాని
నీకిక్కడ  నీడివ్వాలనికాదు

అనుకున్నది ఒకటైతే
అయిన్దొకటీ.. అన్నట్టు
ఇక్కడి పక్షుల ఇళ్ళు
నువు ఆక్రమించావని
ఆక్రోశం, ఆక్రందనలనడుమ
ఎన్నో నిజ నిర్ధారణలనుజేసి
నిను మట్టుబెట్టడమే భేష్ అని
చట్ట సభలలో గట్టిగ తేల్చేసి
చట్టాలనే తెచ్చారీ పెద్దదేశపోళ్లు
అవకాస ప్రజాస్వామ్యవాదులైన
తెలివి, తమ సొత్తనుకొనె ఈ తోడేళ్ళు

మనమేమో మన క(ఖ)ర్మ భూమి
బడుగుదేశమైన  భారతావనిలో
ఈడనుండి వచ్చే పొడుగుముక్కు(పెలికాన్) పక్షులకి
పులికాట్టనే ఓ ఉప్పునీటి సరస్సునే
వాటికి పర్యాటక కేంద్రంగా మారిస్తే
నీ నిర్మూలనకై నిఖార్సైన చట్టాలిక్కడ
అంతే! ఏం చెయ్యగలం? బలవంతుడిదే రాజ్యం!
అందునా, నీకుతెలిసిందేగా మనోళ్ళకు
పొరుగింటి పుల్లకూర మహా రుచని  !

అవునూ!.. నీకీ విషయం తెలుసా ?
నిన్నీడకు మొదటగా తెచ్చిన వీళ్ళు
పరాయిదేశం నుండి ఈ దేశానికొచ్చిన
ఇక్కడి మొట్ట మొదటి ఇమ్మిగ్రంట్లు
అలివిగానోళ్ళనంతమొందించి
అలివయినోళ్ళను అణిచివేసి
నోరు వాయ లేని ఆబోరిజన్లను
వారి సొంతమైన ఈ భూమిని
తమ అవసరాలకు అనువుగా మలచి
ఇది తమ దేశమని  పొజులిచ్చి
దేశాభిమానం చూపే అలివిగాని తెలివైనోళ్ళు

కాబట్టి, కాస్తంత తెలివిగా
(మనసుగాదు) మెదడెట్టి ఆలోచించు మరి!
ఇక్కడి పక్షుల (పక్షులను విడదీసి కడతేర్చే మనుషుల) జోలెల్లక
జాగ్రత్తగా మసలుకొని  లౌక్యంగా ఉండడం నేర్చి
నీ నివాసానికి ఆవాసమైన ఈ ప్రవాస ప్రపంచాన
పది కాలాల పాటు పిల్లా పాపలతో సల్లంగ బతుకు
            ****************

(గోరువంకలను (ఇండియన్ మైనా) ఇక్కడి పక్షుల సంరక్షణార్ధమై సంహరిస్తున్నారని తెలిసి, 
తెలుగు కవనవనాన  ఎన్నో ఎన్నెన్నో ప్రణయ భావాలను స్ఫురిమ్పచేసి ఎంతో మంది కవులను  ప్రభావితం చేసిన గోరువంకకై  స్పందించి వ్రాసిన ఓ చిన్న కవిత ... ఎవరినీ ఉద్దేశించినది కాదని చదువరులు భావించగలరు )

22, జనవరి 2014, బుధవారం

చిరస్మరణీయులు అక్కినేని.. అంజలీ దేవి

అక్కినేని నాగేశ్వర రావు(ఎ ఎన్ ఆర్ )
అందమైన ఆహార్యం 
చదువుకన్నా సంస్కారం
ఉన్నతమైన ఆలోచన
ఉదాత్తమైన ఆదర్శం 
అద్భుతమైన నటన 
అన్నీ మంచి అలవాట్లు
కలబోసిన దసరా బుల్లోడు
మూగమనసుల దోచినోడు
తెలుగు సినిమా సక్కనోడు 
తారై వెండి తెరపై వెలిగిన 
మన అందరి ఎ ఎన్ అర్ 
అసువులుబాసి, ఆకసాన 
సుక్కై(తారై) నిలిచి పోయే 
వెన్నెల్లో.. జాబిల్లికి తోడై

అక్కినేని ఆత్మశాంతికై ప్రవాసాన తెలుగు వారి నివాళి 
అశ్రునయనాలతో ఆ మహా మనిషికి  మా  శ్రద్ధాంజలి ... 

అంజలీ దేవి

ప్రియ సఖిగాప్రేమికురాలిగా
చరణదాసిగాదేవతామూర్తిగా
మా తలిదండ్రుల తరానికి
హావభావాలతో సొగసైన తారగా
భక్తి భావాల గుడిలో దేవతలా 
వారి హృదయాలలో నిలిచి
తల్లిబామ్మ పాత్రల పోషించి
మా తరానికి ఇంటింటా
అమ్మలాఅమ్మమ్మలా
ఆత్మీయానురాగాలను చూపి
నీ నటనలో జీవించి మెప్పించి
వెండి తెరపై  తారవై వెలిగి
అందమైన వెండి వెన్నెల్లో 
చందమామతో ఆకసాన తారవై
వెలిగేందుకుఇక.. సెలవంటూ వెళ్ళిన
అమ్మఅంజలీ ..నీకు మా శ్రద్ధాంజలి!!

13, జనవరి 2014, సోమవారం

వివేకానంద 150వ జయంతి

మానవజాతి హితంకోరేదే మతమని
వేదమన్నది  మతం సొంతంకాదని
భక్తిరాజజ్ఞాన యోగాలతో 
ధార్మికతకుఆధ్యాత్మికతకు
అర్థం చెప్పిన అద్వైత గురువు
వేదాంత విషయ విశ్లేషణవివరణలతో
యోగిగావిరాగిగాబైరాగిలా జీవించి
మానవాళికి యోగవేదాంతకాంతులు
పంచిన విధాతవిశ్వ యువత భవితకు
మార్గదర్శిమానవతామూర్తిస్పూర్తిప్రదాత
నరేంద్రుడునిష్కల్మషుడుఅసమాన్యుడు
దీన జనోభవఅన్న కరుణరసమూర్తి 
ఆత్మానన్దస్వరూపుడు..స్వామి వివేకానంద!
                 ***************
"Take up one idea.
Make that one idea your life
think of it, dream of it, live on that idea.
Let the brain, muscles, nerves, every part of your body, 
be full of that idea, and just leave every other idea alone.
This is the way to success”

n  Swami Vivekananda (12th january - 4th july 1902)

1, జనవరి 2014, బుధవారం

2014


2013.. ఒక  గతం
---------------------------
గతం నాస్తి కాదు నేస్తం !
అది అనుభవాల ఆస్తి !!

2014.. ఓ  వర్తమానం
------------------------------
ఆ అనుభవాన్ని ఓ గమనికగా
వర్తమానానికి విధేయులమై
జీవన గమనం కొనసాగేలా
శ్రద్ధాసక్తులతో, భవితను నిర్దేసిస్తే
ఈ వత్సరం ఆదరికీ సం(మంచి)వత్సరమే

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు