6, డిసెంబర్ 2013, శుక్రవారం

బాబా సాహెబ్ అంబేద్కర్


File:Young Ambedkar.gif

మానవజాతి మనుగడను కులాల కుళ్ళుతోగాక
మాన్వత్వమనే కళ్ళతో మనుషులను ఒక్కటిగా చూడమని
మహిళలను వివక్షతో గాక సమానత్వంతో చూడాలని
భోదించిన మహా మనీషి.. బాబా సాహెబ్ అంబేద్కర్
జోహర్..! జోహార్ !!
** బోధించు! -  సమీకరించు!! -  పోరాడు !!! **
(14 April 1891 - 6 December 1956 )

"మండేలా" ఇక లేరన్న రోజు

శాంతి కాముకుల గుండె పిండిన రోజు 
"మండేలా" ఇక లేరన్న రోజు 

జాత్యహంకారమ్తో తెల్లవాళ్ళు
నల్లవార్ని అలుసుగా
నలుసులవలే నలిపేస్తూ
నరబలి కొనసాగిస్తూ
వారి దేశాన వారినే
బానిసలుగా మార్చేసి
పాలకులై పాలిస్తుంటే

తన జాతివారి కంటతడి
ఆ యువకుడి గుండె తట్టి
నడిపింది నాయకునిగచేసి
నిప్పై,నెగడై  ఉప్పెనలా
దురహంకారుల దోపిడీని
నిలదీసి, నిగ్గుదీసి ప్రపంచాన
తెలిపి, వారి గుండెల్లో గుబులై,
వెలిగిన నల్లజాతి ఆశా జ్యోతి

యవ్వనాన చెరసాలకేగి
జీవితాన 27 సం॥రాలు
జైలుగోడల అంకితంచేసి
చెదరని విశ్వాసమ్తో
శాంతి కాంతులు వెదజల్లి
జాతిని జాగృతంచేసి
బానిస సంకెళ్లను తెంచి
ఆఫ్రికాకు ఆనందంతెచ్చిన
వీరుడు, ధీరుడు నల్లవారి
జాతిపిత, నోబెల్ గ్రహీత
నెల్సన్ మండేలా.. జోహార్ !!

" If you want to make peace with your enemy, you have to work with your enemy. Then he becomes your partner."

---- Nelson Mandela (18 July 1918 - 5 December 2013)

5, నవంబర్ 2013, మంగళవారం

దాగుడు మూతల .. దండాకోర్


కోస్తా కోటేశ్వరన్నా...!
తెలంగాణా తిరుమలేశన్నా..!
రాయలసీమ రాజన్నా...!
చూస్తున్నారా? ..గమనిస్తున్నారా.. ?
 దగాకోర్ల దిగజారుడుతనాన్ని

ఒకడేమో విడిపోవాలంటాడు ?
మరొకడేమో సమైక్యమంటాడు ?
న్యాయం జరగాలనొకడు (తన స్వార్థం కోసం)
అన్యాయమైపోతామనొకడు (తన పెట్టుబడులకోసం)

 రాబందుల రాజకీయాలేంది ?
అరాచక రాచరిక సిద్దాంతాలేంది?
ఒకరు వగచేదేందిమరొకరు నసిగేదేంది ?
ప్రాంతాలను విడగొట్టేదేన్దివిడిపోతేపోయేదేన్ది?
తెలుగు తల్లి ఏడ్చేదేన్దితెలంగాణాతల్లి ఆవిర్భావమేన్ది ?

మనుషుల్ని మోసంచేసే  ఎమోషన్లేన్ది ?
మసిపూసి మారేడుకాయి చేసే  మాటలేంది?
విషయాన్ని వివరించకుండా,  రాజకీయ 
నక్కలైన కుక్కల అరుపుల మెరుపులేన్ది ?
దీక్షలేన్ది?.. లేనిపోని  పీకుళ్ళేన్ది ?

అవును.. అర్థమైందిలే,..అంతేకదా..!
రెక్కాడితేగాని డొక్కాడని మనిషివాయే
నిలువ నీడకూడాలేని నిరుపేదవాయె
నీకెన్దుకులే నీతిలేని నాయ(కుల)గొడవ
కానినీ ఓటేమరి!  వీళ్ళకి  అధికారన్నిచ్చేది

ఆలోచించు మరి.!  అదిగో వస్తోంది 2014
రాజకీయ రంగులతో అరాచకం మెండైన 
కరెన్సీ  కలక్షన్ల , ఎలక్షన్ల పండుగ 
 పూటకు పైసలతో,  పేదరికాన్నెక్కిరించి
పదవులపందేరంకై  బలిసినోళ్ళ పండుగ

16, అక్టోబర్ 2013, బుధవారం

మృత్యపు వంతెన

మనిషికి, దేవునికి మధ్య (వారధి) వంతెన
భక్తా? భయమా? మృత్యువా ?

దేవుళ్ళ వలే పూజలందుకొనే
బాబాల్లారా ? స్వాముల్లారా? పీఠాధిపతుల్లరా ?
ఎక్కడున్నారు? ఏమైపోయారు మీరు ?
సామాన్యులకర్థంకాని సంస్కృతభాషలో
రోజూ తెగ పొగిడి, భజనలు చేసి పూజించే
మీ దేవుళ్ళు, దేవతలు ఏరి ? కనిపించరేరి?
రండి,.వచ్చి బతికించండి ఆ పిల్లలిని, తల్లుల్ల్ని?

రత్నఘర్ లో రాతిదేవుడికి
మ్రొక్కి అదృష్టం పొందాలని
ఆశపడి, ఆ దేవత ముందే
ఆక్రందనలతో అసువులుబాసిన
అన్నెం, పున్నెం ఎరుగని అమాయకులు

ఆ పేద ప్రజల జీవితాలను
జాగృతంచేసి, జీవించడం నేర్పక
మానసికంగా వారికి అండైనిలవక
తీయగమాటలజెప్పి జేజేలెట్టించుకొని
మహిమలతోడ, మోసాలకుపాల్పడి
గుడులు, ఆశ్రమాలకట్టి  ఆధ్యాత్మికాన్ని
వ్యాపారంగా మలచి, వారి నమ్మకాలను
మీ కీర్తి, స్వార్ధాలకు ఫణంగా బలిపెట్టి

ఆత్మే దేవుడని, కనుగొన్న మీరు
పూజలతో రాజులు కారని,వ్రతాలతో మోజులు తీరవని
తెలిసీ, ఎందుకు వదిలిపెట్టరు? కర్మ క్రతువులను
ఎందుకు చెప్పరానిజాన్ని? నిక్కచ్చిగా ఈ  జనానికి
మీ హుండీలు, బ్యాంకులు నింపుకొనుటకు గాకపోతే?

(After reading the news of Ratnaghar bridge stampede which leads to a temple)-

22, సెప్టెంబర్ 2013, ఆదివారం

ఓ సామాన్యుడా!
-----------------

పుట్టుకతో ప్రతి మనిషి
బాల్యాన దైవ సమానుడైన
నడకను నేర్చింది మొదలు
చదువు, సమాజ పరిపక్వతతో
పొందే, సంపాదించే స్థానం అర్హతలు
జీవితాన సంస్కారానికి గాక
సిరిసంపదల కొరకే అని
తలచి, స్వార్థం వైపే నిలిచి
వ్యవస్థలోని  వ్యత్యాసాలు
సమాజభివృద్ధికి నిరోధకాలని
తెలిసి, కలిసి మెలసి ఉంటూనే
కుల, మతాల ఒకరినొకరు
స్వార్థం, అసూయావిద్వేషాలతో
స్నేహం మాటున మోసాల పాల్పడే
దమననీతితో  దానవమానవులు
కరుణ, దయ దేవుని గుణగణాలని
చేసిన పాపాలను కర్మ, క్రతువుల
కడిగి, కమ్మని నైవేద్యాలని పెట్టి
దైవప్రసాదాలను తిని బలిసి
మనిషిని మానవతతో చూడక
మనసుకన్న, మెదడుకు విలివిచ్చే
మాంత్రిక, తాంత్రిక యాంత్రిక జగత్తని
తెలిసి మసలుకో .. ఓ సామాన్యుడా !
సుమనస్కుడవైన నువు ఎప్పటికీ మారకు
ఎందుకంటే? భవిష్యత్తులో భావితరాలకు
మనిషికున్న మంచితనం తెలిపేందుకు
మానవీయతతో దైవాన్ని చూపేందుకు
సమాజ విలువలు కాపాడేందుకు

9, సెప్టెంబర్ 2013, సోమవారం

వినాయక చవితి  

---------------------

విఘ్నాలకు విరుగుడని
విజయాలకు మార్గమని
వినాయక చవితి పండుగ
జరుపుకున్దామనుకున్నా..!
ఇంతలో ... నాలో అంతర్మధనం ..
అడుగుదామనుకున్నా ఆ మూషిక రాజునిలా...

ఉండ్రాళ్ళు, కుడుములు
అట్లు, బొబ్బట్లు, గుగ్గిళ్ళు
వడపప్పు, పాయసం
పరవాన్నం, పంచామృతం

తను ఆరగించడని తెలిసీ
పోటీ పడి మరీ భక్తజనం
కొసరి, నైవేద్యం నివేదించి
భక్తిశ్రద్దల మురిసిపోతారదేన్దో ?

పేదవారు ఆకలితో
అయ్యా! అమ్మా! అని, ఆర్తిగా
అడుక్కున్నా  వేడుకున్నా
కసిరి, ఈసడించుకుంటారెన్దుకో?

ఆత్మ స్వరూపుడవైన నిను
మలిన మనసుల కానగలేక
మంచితనం ముసుగేసుకున్న
ముష్కర(కోరికల) సామ్రాజ్యమిదిలే !

స్వార్థం, అర్థమొక్కటె తెలిసి
మూల్య మంత్ర ముగ్దులై
(అహం)భావజాలానికి బానిసలై
మనమున యాంత్రికచిత్తులై

ప్రతి విషయ విశ్లేషణలో
వ్యాపారం ద్రుక్కొణమై
భయముచే భక్తిగ మెసలి
ముక్తిని పొన్దేద్దామనుకొనే

కుటిల కుసంస్కారాల
మరిగి, మురిగిపోయిన
మానవ సమాజమిదని
ఎరుకేనా? మీ ఏలికకు,
ఎలుకా ! ....ఓ ...చిట్టెలుకా !! 

2, సెప్టెంబర్ 2013, సోమవారం

తండ్రి


నాయనా, నాన్నా అన్నా
అయ్యా, అప్పా అన్నా
బాపూ , బావూజీ అన్నా
పప్పా, డాడీ అన్నా
భాషేదైనా? పిలుపు వేరైనా ?
తండ్రి , తనవాడనే తలపొకటే
ఆత్మీయతానురాగాల ఆలయాన
కోరకనే వరాలిచ్చే దైవంతనే !

తనువూ, మనసు కుటుంబ
క్షేమంకై అర్పించే కర్ణుడు
గౌరవ ప్రతిష్ట ప్రాకారమతడు
బరువు, బాధ్యతల రేడు
హితుడు, మిత్రుడు సన్నిహితుడు
బంధం, అనుబంధాలకు ఆద్యుడు
వెరసి ప్రతి కుటుంబానికి ఆరాధ్యుడు

అందరికీ Father's Day శుభాకాంక్షలు 

15, ఆగస్టు 2013, గురువారం

66 వసంతాల స్వాతంత్ర్యం


స్వాతంత్రం ! ఎవరికీ? భారతదేశానికా? లేక
దేశంలో నివసించే ప్రజలకా ? దేశానికైతే...
ఎలాగోలా, ఎట్టకేలకు వచ్చిందిలే, 1947లో
ఏంటీ... ?  ఎంతోమంది, కష్టపడి తెచ్చారా?

ఏమిలేదు?  200 సంత్సరాలు పట్టిందిగా తేడానికి
అందుకని, అందునా ఆ మధ్యలో దరిదాపుగా
రెండు ప్రపంచ యుద్ధాలు జరిగినతర్వాత
ఆర్ధికంగా ఆంగ్లేయులు బాగా దెబ్బతినగా
ఇంకేం మిగిలింది? అంతా  దొచేసుకున్నాంగా !

అని వాళ్ళు ఇచ్చేస్తే వచ్చిందా? మనం సాధించిందా?

ఆలోచించండి, ఒకరకంగా మనమందరం
ఒకప్పడు ఆంగ్లేయుల వద్ద బానిసలమేగా?
మరి స్వాతంత్రం తరువాత కూడా ఎందుకున్నాయి?
కులాల, మతాల మధ్య కుటిలమైన కుమ్ములాటలు
అవినీతి, అసమానతలు.. అసహాయతా, నిస్సహాయతలు
పేద, ధనిక వర్గాల మధ్య ఎక్కువైపోయిన వత్యాసాలు

దీనిని బట్టి మీకేమనిపిస్తుంది ... ఇప్పటి స్వాతంత్ర్యం

స్వతంత్రంగా మనకు వచ్చిందా? తెచ్చిందా? ఇచ్చిందా ?

11, ఏప్రిల్ 2013, గురువారం

ఉగాది


ఉగాది అంటే, షడ్రుచుల సమ్మేళనమే !
మధురమైన కోరికల సమాహారమే ...తీపి
జీవితపు మలుపుల మణిహారమే .... పులుపు
ఆయురారోగ్యాలకై కష్టించడమే ..... చేదు
వలపు తలపుల వయసు పొగరే .... వగరు
అహంకారాన్ని మరిపించే మమకారమే ... కారం
జీవితపురుచిని పెంచి, ఆనందం పంచేదే  .... ఉప్పు 
ఈ  ప్రక్రుతి జీవితాల సత్యమే ఉగాది
పరుగు పరుగున వచ్చే ఈ సంవత్సరాన
ఆనందం వెల్లివిరిసే "విజయనామాన"
తెలుగు మిత్రులందరికీ "విజయనామ సంవత్సర " శుభాకాంక్షలు 

2, ఏప్రిల్ 2013, మంగళవారం


ప్రవాసాన  నా  ప్రస్థానం
(మార్చి 2003 నుండి )
-------------------------------------------
ప్రవాసంలో  నా  జీవన  ప్రస్థానం
జీవితాన్ని  నేర్పిన  ఓ  దృశ్యకావ్యమ్
మరువలేనిజ్ఞాపకాల సుమధురఘట్టమ్
ఈ  వేసవితో  పూర్తి  దశ వసంతం

యాదృచ్చికంగా ఎదురైన, నేస్తాల సాంగత్యంతో
నాజీవితాన జరిగిన సంఘటనల  నేపధ్యంతో
నన్ను నేను తెలుసుకోన్నానన్నది, నిజం !
అందుకుపకరమైనది ఇక్కడి నా జీవనం

క్రొత్తలో కాస్త కంగారనిపించినా ....!
పోను, పోను పరిచయమయి పాతపడిపోగా ..
పరికించి, పరిశీలనతో ఆలోచించగా
శీతాకాలం చలొక్కటే ..ఒణికిస్తు
ఒకింత, విపరీతమనిపించెనేకాని

మూల్యం  ముందు అదికూడా మరుగైపోయి
అలవాటైనదిలే అనుకోని సర్దుకుపోవడం
మూల్యమమకారాన ప్రతేటా పరిపాటైపోయే
ఖర్చులు పెంచుకోవడమే స్టేటస్ అనుకోని

అద్దె ఇల్లు ఇరుకని, మరిద్దరం...సంపాదిస్తున్నంగా? అని
క్రియేటివ్ అర్కిటెక్టులమనుకొని, నేలకొని ఇల్లునుగట్టి
గృహప్రవేసమిషతో గొప్పతనం నలుగురికిచూపి
మొదటినెలనుండే నెత్తిన మోర్టగేజ్ మోటెత్తుకొని

బతుకు భారమైనా.., బయిటికి కనబడక కుబేరునిలా
ఫోజులతో, ఇంటిమోజుతీరేలోగా  కాంట్రాక్టుజాబుకోతల్తో
కంగారెట్టి, కిమ్మనక తోకముడిచి తెలివిగ పర్మెనెంటయ్యి
పరుగెత్తి పాలకంటే, నిలబడినీళ్ళు తాగుటమేలని

జీవితాన సంపదకన్నా ఆనందానుభూతులు మిన్నని
అర్థమయ్యే అదృష్టం..! అనర్ధాలేమీ జరుగకముందే...

ఇది
పదిసంవత్సరాల నా ఈ ప్రవాసజీవన పరమార్ధం
ఇక ముందేముందో ఎరుగని ప్రశ్నార్ధక భవితవ్యం
జవాబులకై ఎదురుచూడక,  జవాబుదారితనంతో
జీవితాన్ని గడపాలని ఎంచే సగటుమనిషి సంక్షిప్త గాథ

10, మార్చి 2013, ఆదివారం


శివరాత్రి
======


పండితుడైనా  పామరుడైనా,
భక్తకోటి భక్తి శ్రద్ధలతో, రుదృడు
పరమశివుని, పవలురేయి ప్రీతితో
శివ సన్నిదాన ధ్యానంతో
పరమపదాన ప్రమదగణములతోడ
భక్తితో ప్రస్తుతించు, భాగ్యమే శివరాత్రి

చదువరులకు అందరికి మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు






8, మార్చి 2013, శుక్రవారం

మహిళ


మహిలో సృష్టికి సంజీవనై
ప్రతి సృష్టికి కారణభూతమై
ప్రకృతి ప్రాణప్రతిష్ట చేసే
జనని, శక్తి ప్రదాత మహిళ

చదువరులందరికీ
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

6, మార్చి 2013, బుధవారం

'కిరి' కెట్టాట (క్రికెట్టాట)


==============
ఇది మాట తెచ్చిన మంటో,  మరి ఆట తెచ్చిన తంటో
ఆ నోటా, ఈ నోటా విన్నాక  నా మనమున వెలసిన కవనమిది

ఆటంటే, అలసిన మనసుకు ఆటవిడుపు
శ్రమతో, శరీరానికిచ్చే స్వాంతనసుఖం
ఆటంటే ప్రాణం! అదే ఇప్పుడయ్యిందందరికి వ్రణం
ఇగోల సెగల గలాటాల మధ్య మతిలేని క్రికెట్టాట
ఆడేవారికి ఏమిస్తుందో అర్ధమవడంలేదుకాని..
తెలుగులోగిళ్ళలో ఆడాళ్ళేమో " వెధవ క్రికెట్టని "
"ఈ క్రికెట్ కాష్టం కాల్చ" అని దూషణ భాషణల
శాపనార్థాలతో సాగుతున్న "సై " ఆట (సయ్యాట)
ఓ ప్రక్క స్నేహితుల మధ్య మిత్రభేధాల తంట
కొందరికేమో కోపతాపాలతో తీరని కడుపుమంట

ఆ మాటలాటలతో మరికొందరికేమో గాసిప్ ల తీట
అందుకే అందరిని మంచిమనసులతో మసలుకోమంట
ఇటువంటివాటిని మనదరికి ఎప్పటికి రానీయకుండా
అంటి అంటనట్టు, తామరాకుపై నీటిబొట్టై ఉండాలంటా
అభిమానధనులైన అన్నలారా! తెలుగు తమ్ముల్లారా !
తీసేయండి, పెరగనీయకండి మీ మనసున ఈ చీడముళ్ళు
ఇంటా, బయటా ఎందుకు చెప్పండీ మనకిలాంటి చిడుముళ్ళు
చేయి కలిపి నడవండి, నలుగురికీ మార్గదర్సకమవ్వండి
తేనలాంటిమనసున్న తెలుగులం మేమని అందరికిచాటండి

(ఈ కవిత ఎవ్వరినీ ఉద్దేశించింది కాదు, అందరూ సదుద్దేశంతో అర్థం చేసుకుంటారని చదువరులకు మనవి )

20, ఫిబ్రవరి 2013, బుధవారం

అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవం


 ఫిబ్రవరి 21వ తేది మాతృభాషా ప్రియులకు ఎంతో ప్రియమైన రోజు
ఈ రోజు అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవం

ప్రపంచాన మాతృభాష అభివృద్ధికి పాటుపడుతున్న సేవిస్తున్న
అందరికీ మాతృభాషా దినోత్సవం శుభాకాంక్షలు


మాతృభాషలోని మకరందం
అమ్మ అనురాగంలా అనంతం
మరి మరువక మనమందరం
అనుభూతితో ఆస్వాదిస్తూ
 ఆదరిద్దాం ఆజన్మాంతం

మాతృభాషా ప్రియులకు
ముకుళిత హస్తాలతో నమస్కరిస్తూ
మీ రుద్ర

14, ఫిబ్రవరి 2013, గురువారం


ప్రేమికుల రోజు


---------------------
నువు నచ్చిన ఆ సిగ్గే మొగ్గై
నువు మెచ్చిన ఆ నవ్వే పువ్వై
ప్రకృతిని మరచి నీకై విరబూసి
ప్రేమ పరిమళం వెదచల్లే రోజు

ప్రేయసి, ప్రియ స్పర్శలో సేదదీరి
ప్రేమికుల ప్రణయానికి బాటలువేసి
తరియించి తనువు చాలించాలని
అందమైన రోజా,  పోటీపడే రోజు

ప్రేమదేశానికి ప్రియుడీ రోజున రాజై
ప్రణయ మాగాణికి  ప్రేయసి రాణై
ప్రేమ ప్రపంచాన జరుపుకునే సంబరం
అంబరాన్నంటే అంగరంగ వైభవం


******(వయసులో ఉన్న, వయసుపైబడ్డ మరియు వయసుమీరిన 
ప్రేమను ప్రపంచాన  సజీవపరుస్తున్న ప్రేమికులకు ఈ కవిత అంకితం,)  ******



8, ఫిబ్రవరి 2013, శుక్రవారం


తెలుగు భాష
========

మనసెరిగిన భాష మన మాతృభాష
అమ్మపలుకులు నేర్పేటి అమృతభాష
పదాలలో ప్రకృతి మర్మం వివరించేభాష
ప్రపంచానానికి  మన ఉనికిని  తెలిపేభాష
తేనెలొలుకు తీయని మన తెలుగుభాష

ప్రాకృతానికి పుట్టి, సంస్కృతముతో పెరిగి
యాసలతోటి కడు ప్రాశస్త్యమును గాంచి
ఇరుగు పొరుగు  రాష్ట్రాల ప్రజలంతా
అమితంగా ఇష్టపడ్డ అందమైన భాష
తేనెలొలుకు తీయని మన తెలుగుభాష

పర భాషా పదాలను సైతం కలుపుకొని
భాషానుభందాన్నిప్రపంచానికి పరిచయంచేసి
తన సంతతివారే తననంతం చేస్తున్నా
తల్లిలా నిస్వార్ధంతో ఆదరించే అమ్మభాష
తేనెలొలుకు తీయని మన తెలుగుభాష

26, జనవరి 2013, శనివారం



నూరు వసంతాల కాన్బెర్ర
================
ఈ మట్టిలో పుట్టి, ఈ గాలితో కలిసి
ఈ నీటతో పెరిగి, బడబాగ్నితో గెలిచి
ఈ నేలపై అనాదిగా మనుగడసాగించు
అస్మదీయులు, అబారిజన్ల భాషలో
ఆదివాసి పేరేట్టుకొని, అందరిని కలుపుకొని
నిర్మాణంలో నిర్వహణలో పద్దతైన నగరమని
పదుగురూ ప్రస్తుతించి ప్రపంచం మెచ్చేలా
దేశ ప్రజలందరికీ దశ, దిశ, భవితను నిర్దేశిస్తూ
మల్టీకల్చరిజమ్ పేరుతొ మనుషులనోక్కటి చేసి
అభాగ్యులను చేరదీసి అభయహస్తమన్దించి
జీవితాల వెలుగునింపి మానవహక్కుల కాపాడి
దేశ సమగ్రతా,  పరువు ప్రతిష్టల పెంచి
సమైక్యతా సమానత్వమెంచి  సమతుల్యం పాటించి
శత వసంతాలు నడిచి చరితను సృష్టించిన
మా ముఖ్య పట్టణమా కాన్బెర్రా నగరమా
కోటి వసంతాలను గని చరిత్రలో మిగిలిపోయి
మహిలో నగరాలకు తలమానికమవ్వాలని
విశ్వ శాంతి రక్షణలో నువు ముందుగ నిలవాలని ఆశిస్తూ
ఈ ఏటితో శతవసంతాలు  నిండి సంబరాలు జరుపుంటున్న
నీకివే మా ద్విశత సహశ్రాధిక హృదయపూర్వక వందనాలు


                                              --- కాన్బెర్రా తెలుగుప్రజలు



1, జనవరి 2013, మంగళవారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2013


పాతదైపోయె (రెండువేల పండ్రెండు)2012, పయనమై
జీవితానుభవాల అనుభూతుల చరిత్ర పుటల్లోకి
పరుగున వచ్చే(రెండువేల పదమూడు)2013, అనంతమై
ఆశల పల్లకీలో ఊరేగుతూ  కోరికల క్రొత్త సంవత్సరంలోకి
ఈ సంవత్సరం అందరూ  ఈ చెట్టున పండిన చెర్రీ పండులా నిండైన మనసులతో ధర్మంగా నడచుకొని తద్వారా ఆనందాన్ని అందిపుచ్చుకొంటారని ఆశిస్తూ, మిత్రులు, శ్రేయోభిలాషులకందరికీ 2013 నూతన సంవత్సర శుభాకాక్షలతో

మీ
రుద్ర

Posted by Picasa