19, ఫిబ్రవరి 2014, బుధవారం

ముగిసిన విభజన భజన

గడ బిడ రగడల రణ గొణ ధ్వనుల నడుమ
రాష్ట్రం, విభజన సమ్మెల కాష్టమై
బడుగు వారి జీవితాలను వెలకట్టి
ఆంధ్రప్రదేస్ ఆర్ధికప్రగతి అధోగతి పట్టించి
రంగులన్నీకలిసి రాజకీయ రాట్నాన
తిరిగి తిరిగి తుదకు తెలుపైనటుల
తెలుగు సోదరుల సంఘర్షణల మధ్య
వేర్పాటువాదాన,  ఏర్పాటైనవవిగో
తెలుపునలుపు మనసులతో .. తెలంగాణా సీమాంధ్ర రాష్ట్రాలు

ఓ తెలంగాణా తిరుమలేసన్నా!
రాయలసీమ రాజన్నా! కోస్తా కోటేస్వరన్నా!

నేను ఒకప్పుడు మీకు చెప్పింది
గురుతుందా? అయితే.. ఇనుకోండి ..

సంబరాన మునిగి అసలు సంగతి మరువకండి ఎందుకంటే ?
ఆ ఆనందాన మిము ముంచి, అప్పనంగా
అధికారం మింగేయాలని ఆత్రమాత్రంగా
మంత్ర రచనలో నిమగ్నమైన నక్కలవిగో
తమ వాటా కొరకై తెలివిగా మిము మొత్తంగా
వాడుకొని నట్టేట వదిలేసే నీతిలేని తోడేల్లవి

తెలివిగా మసలుకొని అందివచ్చిన ఫలాన్ని
సమంగా అందించే సామాజిక రాష్ట్రాల
నినాదాన్ని వినిపించి,  దీపం ఉండగానే
ఇంటిని చక్కబెట్టుకోమన్న చందంగా
ఊరిని, రాష్ట్రాన్ని ఏ ఒక్కరికి (ఏ కొందరికో)
చెందేలా కాక అందరికీ ఆ త్యాగఫలం అందేలా చూడండి

మొక్కై వంగనిదే మానై వంగనటుల
రంగులోళ్ళు రంగంలోదిగి నీలాటి బడుగులను
విభజించి పాలించక మునుపే మేల్కొని
అధికారం అందుకొని నిజాయతీకి నెలవై
నిస్వార్దానికి అర్థం ఇదని పాలించి నిరూపించు
రాజకీయ విలువలను నేర్పి నీవంటి వారి
జీవితాలకు వెలుగై, నీడైనిలువు నీ ఏలుబడితో

తెలంగాణా  సీమాంధ్ర రాష్ట్రాలు ఏర్పాటు జరగాలి సమ సమాజ నిర్మాణ ధ్యేయంతో,
నిలిచిపోవాలి దేశాన మన ఇరువు తెలుగు రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలకు మార్గదర్సకంగా..


తెలంగాణా సీమాంధ్ర రాష్ట్రాల ఏర్పాటును అభినందిస్తూ.... స్వాగతిస్తూ !
తెలుగువారికి ఒక రాష్ట్రమే కాదు ఇరు రాష్ట్రాలని ఆనందిస్తూ అందరికీ మంచి జరగాలని ఆసిస్తూ .. " ఏది జరిగినా మన మంచికే " అనే సూక్తిని నమ్ముతూ
అందరికీ సుభాభివందనాలు.

4, ఫిబ్రవరి 2014, మంగళవారం

గోరువంక

గోరువంక (ఇండియన్ మైనా)
------------
పసుపు ముక్కుతోడ
పసిమి కాళ్ళతోడ
నల్లాని మెడతోడ
నాజూకైన కళ్ళతో
గోధుమ రెక్కలతో
తోకన నలతెల్లని ఈకలతో
హొయలూ, స్టైలు గలిపి
మడిసోలె నడిసేటి
గొరింకా.!.. ఓ ఇండియన్ మైనా!!

అసలిక్కడ (ప్రవాసాన )
నీ గోడవేందో?  నీకు తెలుసా?
నిన్నీడకు తెచ్చింది
పురుగు పుట్రా తిని, ఇక్కడ
పంటపొలాలకు మాంచి
దిగుబడి వచ్చేలా, వారి
సంపద పెంచేందుకేగాని
నీకిక్కడ  నీడివ్వాలనికాదు

అనుకున్నది ఒకటైతే
అయిన్దొకటీ.. అన్నట్టు
ఇక్కడి పక్షుల ఇళ్ళు
నువు ఆక్రమించావని
ఆక్రోశం, ఆక్రందనలనడుమ
ఎన్నో నిజ నిర్ధారణలనుజేసి
నిను మట్టుబెట్టడమే భేష్ అని
చట్ట సభలలో గట్టిగ తేల్చేసి
చట్టాలనే తెచ్చారీ పెద్దదేశపోళ్లు
అవకాస ప్రజాస్వామ్యవాదులైన
తెలివి, తమ సొత్తనుకొనె ఈ తోడేళ్ళు

మనమేమో మన క(ఖ)ర్మ భూమి
బడుగుదేశమైన  భారతావనిలో
ఈడనుండి వచ్చే పొడుగుముక్కు(పెలికాన్) పక్షులకి
పులికాట్టనే ఓ ఉప్పునీటి సరస్సునే
వాటికి పర్యాటక కేంద్రంగా మారిస్తే
నీ నిర్మూలనకై నిఖార్సైన చట్టాలిక్కడ
అంతే! ఏం చెయ్యగలం? బలవంతుడిదే రాజ్యం!
అందునా, నీకుతెలిసిందేగా మనోళ్ళకు
పొరుగింటి పుల్లకూర మహా రుచని  !

అవునూ!.. నీకీ విషయం తెలుసా ?
నిన్నీడకు మొదటగా తెచ్చిన వీళ్ళు
పరాయిదేశం నుండి ఈ దేశానికొచ్చిన
ఇక్కడి మొట్ట మొదటి ఇమ్మిగ్రంట్లు
అలివిగానోళ్ళనంతమొందించి
అలివయినోళ్ళను అణిచివేసి
నోరు వాయ లేని ఆబోరిజన్లను
వారి సొంతమైన ఈ భూమిని
తమ అవసరాలకు అనువుగా మలచి
ఇది తమ దేశమని  పొజులిచ్చి
దేశాభిమానం చూపే అలివిగాని తెలివైనోళ్ళు

కాబట్టి, కాస్తంత తెలివిగా
(మనసుగాదు) మెదడెట్టి ఆలోచించు మరి!
ఇక్కడి పక్షుల (పక్షులను విడదీసి కడతేర్చే మనుషుల) జోలెల్లక
జాగ్రత్తగా మసలుకొని  లౌక్యంగా ఉండడం నేర్చి
నీ నివాసానికి ఆవాసమైన ఈ ప్రవాస ప్రపంచాన
పది కాలాల పాటు పిల్లా పాపలతో సల్లంగ బతుకు
            ****************

(గోరువంకలను (ఇండియన్ మైనా) ఇక్కడి పక్షుల సంరక్షణార్ధమై సంహరిస్తున్నారని తెలిసి, 
తెలుగు కవనవనాన  ఎన్నో ఎన్నెన్నో ప్రణయ భావాలను స్ఫురిమ్పచేసి ఎంతో మంది కవులను  ప్రభావితం చేసిన గోరువంకకై  స్పందించి వ్రాసిన ఓ చిన్న కవిత ... ఎవరినీ ఉద్దేశించినది కాదని చదువరులు భావించగలరు )