27, జులై 2018, శుక్రవారం

ఏ పాటి?

ఎవరు ఏ పాటి?
తెలిసిందేపాటి? ఎరుకైందేపాటి?
ఎవరికి ఎవరు సాటి?
ఎవరెవరి మధ్య ఈ పోటీ?

ఒకడేమో సహపాటి
మరొకడు ఘనాపాటి
ఇప్పుడింకొకడు తయారు!

వ్యాపారంలో లాభం రాక
ఉద్యోగంలో రాదనా రూక
మనుషుల్లో బలహీనత
ఎంచక్కా  గమనించాక
పట్టాడీ ప్రవచనాల బాకా..!

వినేవాడికి చెప్పేవాడు లోకువన్నట్టు
ఇతగాడు చెప్పే నీతులు
తీసే కులాల లోతులు
ఆతని సమాజ రీతులు
ప్రజాస్వామ్యానికి గోతులు
రాజ్యాంగ వ్యతిరేక కారకాలు
ఇతడు ఛాందస భావాల
ముసుగులో కుహనా పాటి
డబ్బుకు గడ్డితినడమే పరిపాటి.

సంభావనలేకుండా ఒక్క ప్రవచనం
చెబుతారేమో చూడండి?
కులం హలంనుండి పెల్లుబికిన
సనాతన మురికే ఈ గడ్డిపాటి
తస్మాత్ ! జాగ్రత్త !!

 ఎవరిది ఏ స్థాయి?
నిర్ణయించడానికి, వీరికెక్కడిదా స్థాయి?
ఎవరిక్కడ, ఎప్పటికీ చిరస్ధాయి?
మనుషుల్లో హెచ్చు తగ్గులు
పుట్టుకతో ఎలా వస్తాయి ?
కొందరికే, అవెలా తెలుస్తాయి?


నాటికి, నేటికీ
తమ స్వార్థంకై
మాట మాటకీ
శ్లేషను, విశ్లేషణను
పురాణఇతిహాసాలను
ఇప్పుడు, కొత్తగా ప్రవచనాలని
నీతని, నేతిమాటల చెప్పి
పట్టు పీతాంబరాలతో
ఒకింత సాంకేతికత
జోడించి, జూ లక టక
మాటల మూటలను
గంటల పంచాంగాలతో
వాస్తు అవాస్తవాలతో
తిమ్మిని బిమ్మిని చేసే
మాటల గారడీలతో
హిందుత్వ అజెండాల
మతతత్వ అధికార అండతో

అమ్మని, సరస్వతమ్మనీ
అమ్ముకొని, పబ్బంగడుపుకొనే
వ్యాపారం ఊపందుకొంది.
మానవుల, మనువు బానిసల
చేసే పర్వం ఆరంభమైంది
ఈ ఇరవయ్యొకటో శకంలో

మేలుకో, ఓ యువతా మేలుకో!!
ఈ జగతి జాగృతికై
విచక్షణతో వీక్షించి, ప్రశ్నించి
సమాధానపడి, సంయవనంతో
ప్రపంచాన్ని గమనించి నడుచుకో!
నీ జీవన గమనం మెరుగుపరుచుకో!!
మానవత్వంతో ప్రపంచాన్ని గెలుచుకో !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి