16, సెప్టెంబర్ 2018, ఆదివారం

పరువు హత్య

ముందుగా,ఈ కవితలో నాభాషను క్షమించి భావావేశ గాఢతను అర్ధం చేసుకొంటారని మనవి.

మనుషుల్లో మంచితనాన్ని, గొప్పతనాన్ని నాగరికతతో, మానసిక పరిపక్వతతో ఎంచుతామే కానీ వారి కులంతో, మతంతో కాదు అని నమ్మి ... కులాల కంపును, జరుగుతున్న పరువు హత్యలను చూసి భరించలేక వేదనతో రాసిన కవిత.

 పరువుహత్య మాట విని
హృదయం బరువైంది
అశృవులతో, ఆవేశంతో
నా కన్నెరుపెక్కింది 
అమృతం వర్షించే మనసు
ఆ ప్రణయ హత్యోదంతో 
నిండు గర్భిణి, సోదరి 
అమృతవర్షిణి ఆవేదనకు 
చలించి కత్తై, నా కలం కదిలిందిలా
కులదురహంకారంపై ... కసిగా,

కులం మలం తిని
అదే బలం అనుకొని
తెగ మొరిగే శునకాల్లారా!
మా కులమెక్కువని పెట్రేగే
అహంకార, కుసంస్కారుల్లారా
మనిషిగ బ్రతకలేని మృగాల్లారా!

ఇరువదితరాల వెనుకకు, 
తాత ముత్తాతలపేర్లే తెలియని, సంకరజాతి మనందరిదని
మలినమైన మీ బుర్రలకెరుకేనా?

నీతిమాలి, దౌర్జన్యాలతో
అక్రమాస్తుల, పైసల,
పెత్తందారీ పదవులనార్జించి 
పరువు పెంటకుప్పల పేర్చి  
అశుద్ధాన్ని అమృతంలా ఆరగిస్తూ,
ఆత్మీయత అనే అర్థాన్ని
కులాహంకారానికి ఆపాదిస్తూ 
ఆ అవలక్షణాన్ని అందరికీ అంటిస్తూ
మీ స్వార్ధం వ్యర్ధాలను పోగేస్తూ
మనుషుల మనసు, మానవత్వాన్ని
మీ కులజాడ్యాలతో విభజించి పోషిస్తూ

పరువు హత్యల పేరున,
నిండు ప్రాణాలనే బలికొంటూ
కులం కాలకూటవిషంతో, విషనాగులై,
పచ్చని సంసారాలను ఛిద్రం చేస్తూ..
కులం, మతం, దైవం ఆచారాల వంకతో
బావిలో కప్పలవలె, మనువునీతిదని,
ఆ అభిజాత్యాన్ని పెంచి పోషిస్తూ,
యువత భవితను కోతిని చేసి ఆడిస్తూ
చివరకు ఆ గోతిలోనే పడి ఛస్తూ
ఏం బావుకుంటావురా?  
జీవిత చరమాంకంలో?

 ఛీ .ఛీ... నీచ నికృష్ట కులగజ్జి రోగి!!
నీ జబ్బుకు మందెక్కడో లేదు
నీలోనే ఉందది, వెతుకు నిబద్దతతో,
మనిషిగా, మంచిగ బతకాలనుకొంటే
అతిత్వరగా అలోచించి నయంచేసుకో
లేకుంటే, అన్నివిధాలా అత్యధికంగా
మానసికంగా, కృశించి, నశించి,
ఈ విశ్వానికి పట్టిన చీడ పురుగై,
మరుగై పోతావ్..!  ఖబడ్దార్!!

అంతేకాదు,
ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో
కులం శబ్దమినివించిందో..?
రేపటి తరం, నీ శిశ్నము కోసి
కాకుల గద్దలకాహారంగా వేసి
నువొక మానసిక రోగివని,
నీ ఉద్రేకానికి, ముద్రేయ్యకముందే
ప్రపంచగతినర్ధంచేసుకుని మారిపో ?
లేకపోతే, నీకిక పుట్టగతులుండవ్
ఈ నవ యువ ప్రపంచీకరణాన !

(నల్గొండ జిల్లా మిర్యాలగూడ వాసి, పరువు  హత్యకు గురైన "ప్రణయ్" కు శ్రద్ధాంజలితో )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి