9, సెప్టెంబర్ 2018, ఆదివారం

తెలుగంటే?

తెలుగంటే??

తెలుగంటే, గుర్తింపుకై
మురిపెంగా నువు ధరించే
తెల్లచొక్క, ధోతీకాదురా!
ఆ ఉనికిని పెంచగ
భుజంపై వేలాడే
ఉత్తరీయం కాదురా!
తెలుగంటే భాషరా!
తెలుగంటే మాటరా!
తెలుగంటే  పాటరా!
భాషతొ మమేకమవ్వాలంటే
నీజీవన సంజీవనదవ్వాలంటే        

ఇంటా, బయట
అనుభూతితో, నువ్వు
పలికితేనే అది బతికేది
మాటాడితేనే మనేది

తెలుగు భాష ఎవరిది తెలుసా?
ఎన్నోభాషల నేర్చి, పాండిత్యం గడించి
గండపేరుండాలను పొందిన
ఉద్దండ పండితుడిది కాదు

ఈ భాషలో తప్ప
వేరే భాషానుభూతిని
పొందే అవకాశంలేని
పామరుడి తల్లిభాషరా!తెలుగు భాష!!

అపుడెమో సంస్కృతం
సంకనెట్టి మరీ సగం చంపారు,
ఆంగ్లానికిప్పుడేకంగ అమ్మేశారు.

కాస్తంత, ఇప్పుడైనా
చదవండి, రాయండి
గ్రాంధికమని, గ్రంథస్థమని
కట్టుబాట్ల, భాషను బంధించి
వాడుకని,యాసని,
స్వచ్ఛమైన భాషని
అక్షర ఆంక్షలకిక పోకండి.

భాషను మీనమేషాలకు
శ్లేషలకు, పరిమితి చేసి
తేట తెలుగునుకూడా
సంస్కృతంలా, సంధ్యవార్చి
అత్యుత్సహంతో అటకెక్కించకండి.

అందరి మదిగదిలో
నదిలా, సెలయేరులా
భాషను, భావాన్ని
ప్రజావాహినిలో, సాహితీ ప్రపంచాన
ఆలోచనతో, అవగాహనను పెంచి

పరస్పరం తమ, పర
సత్కారాల, పురస్కారాలకే గాక
తెలుగు భాషోద్యమం, అనే
యజ్ఞంలో భాగస్వాములవుతూ
ఏ దిక్కునున్నా దిక్సూచులై నిలిచి
తెలుగు భాష ఋణానుబంధాన్ని
కాస్తైనా తీర్చుకొనే అవకాశాన్ని
అందుకొని, ఆదర్శంగా నిలుద్దాం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి